దేశంలోనే తెలంగాణ పోలీస్‌ నంబర్‌వన్‌

తెలంగాణ రాష్ట్ర పోలీసుల బదిలీలు, పోస్టింగ్‌ల్లో రాజకీయ జోక్యం ఉందని, దొంగలతో పోలీసులు కలిసిపోయారంటూ ఈనాడు దినపత్రికలో వచ్చిన ‘దొంగలతో దోస్తీ’ కథనం పూర్తిగా అవాస్తవం అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో ఉన్న తెలంగాణ పోలీసుల ప్రతిష్టను దిగజార్చేందుకే ఈనాడు పత్రిక కుట్రపూరితంగా కథనం రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనాడు రాసిన కథనాలతో ప్రజల్లో పోలీసులంటే విశ్వాసం సన్నగిల్లుతుందన్నారు. ఈ మేరకు శనివారం ఆయన లక్డికాపూల్‌లోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజకీయ జోక్యంతో పోస్టింగ్‌లు ఇస్తున్నారంటూ ఎలాంటి ఆధారాలు లేకుండానే ఎలా రాస్తారని ఆగ్రహం హోం మంత్రి వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తా కథనం రాసి పోలీస్‌ ప్రతిష్ట దిగజార్చడం బాధాకరమన్నారు. ‘ఎవరు డబ్బులు వసూలు చేస్తున్నారు..ఎట్లా చేస్తున్నారు?..అన్న దేనికీ ఆధారాలు లేవు. నేను ఈనాడు ఎడిటర్‌, చీఫ్‌ ఎడిటర్‌కు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా..ఈ ఆరోపణలు మీరు నిరూపించండి. లేదంటే క్షమాపణ చెప్పండి’అని హోంమంత్రి మహమూద్‌అలీ సవాల్‌ విసిరారు. పోలీస్‌శాఖ ఎంతో  నిరాధార కథనాలు రాయడం సరికాదన్నారు. ఆధారాలు నిరూపించకపోతే ఈనాడుపై రూ.వెయ్యికోట్లకు పరువునష్టం దావా వేస్తామని హోం మంత్రి మహమూద్‌ అలీ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో ఎన్నో అనునాలు ఉండేవని, తెలంగాణ వస్తే నక్సలిజం పెరుగుతుందని, శాంతిభద్రత సమస్యలు వస్తాయని..ఇవన్నీ తెలంగాణ పోలీసులు పటాపంచలు చేశారన్నారు. గతంలో హైదరాబాద్‌లో ఎప్పుడూ కర్ఫ్యూలు ఉండేవని, అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఐదున్నరేండ్లలో ఏ ఒక్క నిమిషం కూడా కర్ఫ్యూ విధించలేదని పేర్కొన్నారు. చరిత్రలో ఏనాడూ లేనంత ప్రశాంతంగా తెలంగాణ ఉందన్నారు. పోలీస్‌శాఖకు సైతం ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చిందన్నారు. ఎక్కడా రాజకీయ జోక్యం లేదని స్పష్టం చేశారు. వాస్తవం ఇలా ఉంటే ప్రభుత్వాన్ని, పోలీస్‌శాఖను అప్రదిష్టపాలు చేసేందుకు కొందరు పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర, పోలీస్‌శాఖ ప్రతిష్ట దెబ్బతీసేందుకు ఈనాడు చేస్తున్న కుట్రలో భాగమే ఈ వార్తాకథనం అన్నారు.  మీడియాలో వచ్చే కథనాలు సామాన్య ప్రజల నుంచి అందరూ విశ్వసిస్తారని, అలాంటి కథనాలు రాసేటప్పుడు ఆధారాలు లేకుండా రాయడం సరికాదన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో పోలీస్‌శాఖ అత్యుత్తమంగా పనిచేస్తోందన్నారు. 24 గంటల పాటు గస్తీముమ్మరం చేశామన్నారు. శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయంటే తెలంగాణ పోలీసులు ఎంత సమర్థంగా పనిచేస్తున్నారో అర్థమవుతుందన్నారు.